||సుందరకాండ ||

||పన్నెండవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 12 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ ద్వాదశస్సర్గః

శ్లో|| స తస్య మధ్యే భవనస్య మారుతిః
లతాగృహంశ్చిత్రగహాన్నిశాగృహాన్|
జగామ సీతాం ప్రతిదర్శనోత్సుకో
న చైవ తాం పశ్యతి చారుదర్శనామ్||1||

స|| సః మారుతిః తస్య భవనస్య మధ్యే సీతాం ప్రతి దర్శనోత్సుకః లతా గృహాన్ చిత్రగృహాన్ నిశాగృహాన్ జగామ| చారుదర్శనామ్ తాం న పశ్యతి ఏవ ||

తా|| ఆ మారుతి ఆ భవనముల మధ్యలో సీతను వెదకవలెనను ఉత్సాహముతో లతాగృహములు, చిత్రగృహములు , రాత్రిభవనములు అన్నీచూచెను. కాని శుభముగా కనపడు ఆమె మాత్రము కనపడలేదు.

శ్లో|| స చింతయామాస తతో మహాకపిః
ప్రియామపశ్యన్ రఘునందనస్య తామ్|
ధ్రువం హి సీతా మ్రియతే యథా న మే
విచిన్వతోదర్శన మేతి మైథిలీ||2||
సా రాక్షసానాం ప్రవరేణ జానకీ
స్వశీలసంరక్షణ తత్పరా సతీ|
అనేన నూనం ప్రతి దుష్ట కర్మణా
హతా భవేత్ ఆర్యపథే పరే స్థితా||3||
విరూప రూపా వికృతా వివర్చసో
మహాననా దీర్ఘవిరూప దర్శనాః|
సమీక్ష్య సా రాక్షసరాజయోషితో
భయాద్వినష్టా జనకేశ్వరాత్మజా||4||

స|| తతః మహాకపిః రఘునన్దనస్య ప్రియామ్ తామ్ అపశ్యన్ చింతయామాస | మైథిలీ విచిన్వతః మే యథా దర్శనమ్ న ఉపైతి సీతా ధ్రువమ్ మ్రియతే|| సా జానకీ పరే ఆర్యపథే స్థితా స్వశీలసంరక్షణతత్పరా సతీ ప్రతి దుష్టకర్మణా అనేన రాక్షసానాం ప్రవరేణ హతా భవేత్ నూనం|| సా జనకేశ్వరాత్మజా భయాత్ విరూపరూపాః వికృతాః వివర్చసః మహాననాః దీర్ఘవిరూప దర్శనాః రాక్షసరాజ యోషితః సమీక్ష్య వినష్టా||

తా|| అప్పుడు ఆ మహాకపి రఘునందనుని ప్రియురాలైన ఆమెను చూడలేకపోగా అలోచనలో పడెను. మైథిలి వెతుకుతూ "నాకు సీతా దర్శనము దొరకుటలేదు. ఆమె తప్పక మరణించిఉండవచ్చును. ఆ జానకి ఆర్య మార్గములో ఉండి తన శీలము రక్షించుకొంటూ ఈ దుష్టకర్మలు చేయు రాక్షస ప్రవరులచేత తప్పక చంపబడియుండును. ఆ జనకేశ్వరుని కూతురు విరూపము గలవారు, వికృతమైనవారు, కాంతిలేని వారు, పెద్దకళ్ళుకలవారు, పొడవుగా వికృతముగా కనపడు వారు అగు రాక్షసరాజ వనితలను చూసి భయముతో మరణించవచ్చు.

శ్లో|| సీతాం అదృష్ట్వాహ్యనవాప్య పౌరుషమ్ విహృత్య కాలం సహ వానరైశ్చిరమ్|
న మేsస్తి సుగ్రీవ సమీపగా గతిః సుతీక్ష్ణ దణ్డో బలవాంశ్చ వానరః||5||

స|| సీతాం అదృష్ట్వా పౌరుషం అనవాప్య వానరైః సహ చిరం కాలం విహృత్య సుగ్రీవ సమీపగా గతిః నాస్తి | వానరః (సుగ్రీవః) సుతీక్ష్ణదణ్డః బలవాంశ్చ||

తా|| సీతను చూడకుండా , ఆ పురుషకార్యము సాధించకుండా, వానరులతో చిరకాలము గడిపి సుగ్రీవుని సమీపమునకు వెళ్ళుట కుదరదు. ఆ వానరాధిపతి అతి బలవంతుడు. కఠిన దండము విధించువాడు.

శ్లో|| దృష్టమంతః పురం సర్వం దృష్ట్వా రావణయోషితాః |
న సీతా దృశ్యతే సాధ్వీ వృథాజాతో మమ శ్రమః||6||
కింను మాం వానరాస్సర్వే గతం వక్ష్యంతి సంగతాః|
గత్వా తత్ర త్వయా వీర కిం కృతం తద్వదస్య నః ||7||

స|| సర్వం అంతః పురం దృష్టం| రావణయోషితాః దృష్టా| సాధ్వీ సీతా నదృశ్యతే|మమ శ్రమః వృథా జాతః|| గతం మాం సంగతాః సర్వే వానరాః కిం ను వక్ష్యంతి |వీర తత్ర గత్వా త్వయా కిం కృతం | తత్ నః వదస్వ||

తా|| " అంతః పురము అంతా చూడబడినది. రావణస్త్రీలు అందరూ చూడబడిరి. సాధ్వీ సీత కనపడుటలేదు. నా శ్రమ వృధా అయినది. తిరిగి వచ్చిన నన్ను వానరులందరూ ఏమి అంటారు. 'ఓ వీరుడా అక్కడకి వెళ్ళి ఏమి చేసినవాడవు'?"

శ్లో|| అదృష్ట్వా కిం ప్రవక్ష్యామి తాం అహం జనకాత్మజామ్|
ధ్రువం ప్రాయముపైష్యంతి కాలస్య వ్యతివర్తనే||8||
కిం వా వక్ష్యతి వృద్ధశ్చ జామ్బవాన్ అఙ్గదశ్చ సః|
గతం పారం సముద్రస్య వానరాశ్చ సమాగతాః||9||

స|| కాలస్య వ్యతివర్తనే తాం జనకాత్మజాం అదృష్ట్వా కిం ప్రవక్ష్యామి | ధృవం ప్రాయం ఉపైష్యంతి|| సముద్రస్య పారం గతం వృద్ధః జామ్బవాన్ కిం వా వక్ష్యతి | సః అఙ్గదః చ | సమాగతః వానరాశ్చ|

తా|| "కాలాఅవధి దాటిపోయినతరువాత ఆ జానకిని కనుగొనక వారికి ఏమి చెప్పెదను? వారు తప్పక ప్రాయోపవేశము చేసెదరు. సముద్రమును దాటి వచ్చిన నన్ను వృద్ధుడు జాంబవంతుడు అంగదుడు తక్కిన వానరులు ఏమి అంటారు?"

శ్లో|| అనిర్వేద శ్శ్రియోమూలం అనిర్వేదః పరం సుఖమ్|
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః||10||
కరోతిసఫలం జంతోః కర్మ యత్ తత్ కరోతి సః|
తస్మాత్ అనిర్వేదకృతం యత్నం చేష్టేఽహముత్తమమ్||11||
భూయస్తావత్ విచేష్యామి దేశాన్ రావణపాలితాన్|

స|| అనిర్వేదః శ్రియః మూలం అనిర్వేదః పరం సుఖం అనిర్వేదః సతతామ్ సర్వార్థేషు ప్రవర్తకః హి ||యత్ కర్మ కరోతి జంతోః తత్ సఫలం కరోతి సః| తస్మాత్ అహం అనిర్వేదకృతం ఉత్తమమ్ ప్రయత్నం చేష్టే |భూయః అదృష్టవాన్ రావణపాలితాన్ దేశాన్ విచేష్టామి తావత్||

తా|| నిర్వేదము లేకుండుటమే శ్రియమునకు కారణము. నిర్వేదము లేకుండుట పరమ సుఖము. నిర్వేదము లేకుండా ఉన్నవాడు అన్ని ప్రయత్నములలోనూ సఫలుడు అగును. జీవుడు కర్మచేసినచో అది సఫలము అగును. అందువలన నిర్వేదము లేకుండా ఉత్తమమైన ప్రయత్నము చెసెదను. మళ్ళీ చూడబడని రావణ పాలిత దేశమును చూచెదను.

శ్లో|| అపానశాలా విచితాః తథా పుష్పగృహాణి చ||12||
చిత్రశాలాశ్చ విచితా భూయః క్రీడా గృహాణి చ|
నిష్కుటాన్తర రథ్యాశ్చ విమానాని చ సర్వశః||13||

స||పానశాలాః విచితాః |తథా పుష్ఫగృహాణి చ | చిత్రశాలాశ్చ విచితాః |భూయః క్రీడాగృహాణి చ|నిష్కుటాన్తర రథ్యాశ్చ| విమానాని చ| సర్వశః||

తా|| పానశాలలు చూడబడినవి. పుష్పగృహములు చూడబడినవి. చిత్రశాలలు చూడబడినవి. మళ్ళీ క్రీడా గృహములు కూడా చూడబడినవి. ఉద్యానముల మధ్యలోనున్న వీధులు కూడా చూడబడినవి. విమానములు కూడా చూడబడినవి. అన్నిప్రదేశములు చూడబడినవి.

శ్లో|| ఇతి సంచిత్య భూయోఽపి విచేతు ముపచక్రమే|
భూమిగృహాం శ్చైత్య గృహాన్ గృహాతిగృహకానపి||14||
ఉత్పతన్ నిష్పతం శ్చాపి తిష్ఠన్ గచ్చన్ పునః పునః|
అపావృణ్వంశ్చ ద్వారాణి కవాటాన్యవఘాటయన్||15||
ప్రవిశన్ నిష్పతం శ్చాపి ప్రపతన్ ఉత్పతతన్ అపి|
సర్వమప్యవకాశం స విచచార మహాకపిః||16||

స|| ఇతి సంచిత్య భూమి గృహాన్ చైత్య గృహాన్ గృహాతిగృహకానపి భూయః అపి విచేతుం ఉపచక్రమే||సః మహాకపిః పునః పునః ఉత్పతన్ నిష్పతంశ్చాపి తిష్ఠన్ గచ్ఛన్ ద్వారాణి అపావృణ్వన్ కవాటాని అవఘాటయన్ ప్రవిశన్ నిష్పతంశ్చాపి ప్రపతన్ ఉత్పతన్నపి సర్వం అపి అవకాశమ్ విచచార||

తా|| ఈ విధముగా అలోచించి భూమి గృహములు, చైత్య ప్రాసాదములు , విడివిడిగా నున్న గృహములు మళ్ళీ వెదుకుట మొదలుపెట్టెను. ఆ మహాకపి మళ్ళీ మళ్ళీ ఎక్కుతూ దిగుతూ, ద్వారములు దాటుతూ, తలుపులను తీస్తూ, లోపలికి ప్రవేశిస్తూ బయటకి వస్తూ అవకాశము ఉన్నంతవరకు వెదుకుతూ తిరిగెను.

శ్లో|| చతురఙ్గుళమాత్రోఽపి నావకాశః సవిద్యతే|
రావణాన్తఃపురే తస్మిన్ యం కపిర్నజగామ సః||17||
ప్రాకారాన్తరరథ్యాశ్చ వేదికాశ్చైత్య సంశ్రయాః|
దీర్ఘికాః పుష్కరిణ్యశ్చ సర్వం తే నావలోకితమ్||18||

స|| తస్మిన్ రావణాంతః పురే స కపిః యమ్ న జగామ సః అవకాశః చతురంగుళమాతః అపి న విద్యతే| ప్రాకారాన్తరరథ్యాశ్చ చైత్యసంశ్రయాః వేదికాః దీర్ఘికాః పుష్కరిణశ్చ సర్వమ్ తేన అవలోకితమ్||

తా|| ఆ రావణాంతః పురములో ఆ వానరుడు ఎక్కడవెళ్ళలేదో అది నాలుగు అంగుళములు కూడా ఉండదు. ప్రాకారము నడుమ గల వీధులు , చైత్యప్రాసాదముని ఆనుకుని ఉన్న వేదికలు, పుష్కరిణులు అన్నీ చూడబడినవి.

శ్లో|| రాక్షస్యో వివిధాకారా విరూపా వికృతాస్తథా|
దృష్టా హనుమతా తత్ర నతు సా జనకాత్మజా ||19||
రూపేణా ప్రతిమా లోకే వరా విధ్యాధరస్త్రియః|
దృష్టా హనుమతా తత్ర నతు రాఘవనన్దినీ||20||

స|| తత్ర హనుమతా వివిధాకారాః వికృతాః విరూపాః రాక్షస్యః దృష్టా | సా జనకాత్మజా న తు|| హనుమతా తత్ర లోకే రూపేణ అప్రతిమా వరాః విధ్యాధరస్త్రియః దృష్టా| న తు రాఘవనన్దినీ|

తా|| అక్కడ హనుమంతుడు వివిధాకారములు కల వికృతరూపము గల రాక్షసులను చూచెను. కాని జనకాత్మజను చూడలేదు. అ హనుమంతునికి అక్కడ లోకము లో సాటిలేని విద్యాధరస్త్రీలు కనపడ్డారు కాని సీత కనపడలేదు.

శ్లో|| నాగకన్యా వరారోహాః పూర్ణచంద్రనిభాననాః|
దృష్టా హనుమతా తత్ర నతు సీతా సుమధ్యమా||21||
ప్రమధ్య రాక్షసేన్ద్రేణ దేవకన్యా బలాద్దృతాః|
దృష్టా హనుమతా తత్ర నతు సా జనకనన్దినీ||22||

స|| హనుమతా తత్ర వరారోహాః నాగకన్యాః పూర్ణచంద్ర నిభాననాః దృష్టా| న తు సుమధ్యమా సీతా|| రాక్షసేంద్రేణ ప్రమథ్య బలాత్ హృతాః నాగకన్యాః తత్ర హనుమతా దృష్టా| న తు సా జనకనందినీ||

తా|| హనుమంతుడు అక్కడ అతిసౌందర్యవతులగు పూర్ణచంద్రునివంటి వదనము కల నాగకన్యలు కనపడిరి. కాని సన్నని నడుము కల సీత కనపడలేదు. రాక్షసేంద్రునిచేత బలముతో ఓడింపబడి తీసుకురాబడిన నాగకన్యలను చూచెను. కాని సీత కనపడలేదు.

శ్లో|| సోsపశ్యం స్తాం మహాబాహుః పశ్యం శ్చాన్యా వరస్త్రియః|
విషసాద ముహుర్థీమాన్ హనుమాన్మారుతాత్మజః||23||
ఉద్యోగం వానరేన్ద్రాణాం ప్లవనం సాగరస్య చ|
వ్యర్థం వీక్ష్యానిలసుతః చింతాం పునరుపాగమత్||24||

స|| మహాబాహుః ధీమాన్ మారుతాత్మజః సః హనుమాన్ తామ్ ( సీతాం ) అపశ్యన్ అన్యాః వరస్త్రియః పశ్యన్ ముహుః విషసాద|| అనిలసుతః తాం వీక్ష్య వానరేంద్రాణామ్ ఉద్యోగమ్ సాగరస్య చ ప్లవనం చ వ్యర్థమ్ (ఇతి చిన్తయామాస)| సః పునః చిన్తామ్ ఉపాగమత్||

తా|| మహాబాహువు, ధీమంతుడు అగు మారుతాత్మజుడు అయిన హనుమంతుడు ఆ సీతను చూడక ఇతర వర స్త్రీలను చూచి మళ్ళీ నిరుత్సాహపడెను.

శ్లో|| అవతీర్య విమానాచ్చ హనుమాన్ మారుతాత్మజః |
చిన్తాముపజగామా థ శోకోపహతచేతనః||25||

స|| అథ మారుతాత్మజః హనుమాన్ విమానాత్ అవతీర్య శోకోపహతచేతనః చిన్తాం ఉపజగామ||

తా|| అప్పుడు ఆ మారుతాత్మజూడగు హనుమంతుడు శోకములో మునిగినవాడై ఆ విమానమునుండి క్రిందకి దిగి ఆలోచించ సాగెను.
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ద్వాదశస్సర్గః||

ఈ విధముగా వాల్మీకి రామాయణములోని సుందరకాండలో పన్నెండవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||